27, ఏప్రిల్ 2015, సోమవారం

మత సంస్థల సూత్రీకరణలు- ప్రలోభాలు -2


           గతం లేదు. వర్తమానం, భవిష్యత్తు మాత్రమే ఉంది. అది కూడా భవిష్యత్తులో ఆత్మ మాత్రమే మిగులుతుంది. అది స్వర్గ, నరకాలనే రెండు ప్రత్యామ్నాయాలను మాత్రమే చూపిస్తుంది. జడ్జిమెంట్ డే తర్వాత శాశ్వతంగా స్వర్గమో, నరకమో ప్రాప్తిస్తుంది. ఈ రకమైన పదార్ధాన్ని విక్రయిస్తున్నవి క్రిష్టియన్, ఇస్లాం మతసంస్థలు, వాటి శాఖలు.

                వీటిలో ప్రకృతి స్వరూపమైన జగత్తు అనగా ఈ మహా విశ్వానికి ప్రాధాన్యత తక్కువ.

                                 ప్రకృతికీ, ప్రకృతి స్వరూపమైన స్త్రీకీ మరీ అల్పమైన చోటూ ఉంటుందక్కడ. ఎందుకంటే స్త్రీ నరుడి నుండి బయటకు తీసిన పక్కటెముక స్వరూపిణీ కదా.

                       మానవ జన్మనే వీరు పాప చర్యగా  ప్రచారం చేస్తారు. భూమి అనేది తప్పించుకోవలసిన స్థలంగా వీరు ప్రచారం చేస్తారు. ఆడం అండ్ ఈవ్ అనే సిద్ధాంతం తయారు చేసినా, నేడు మగవాడు తన ఎముకతో తయారు చేసిన ఈవ్‍ని గుర్తించాలా వద్దా; ఏదో ఒక ఈవ్‍నా, లేక అనేక ఈవ్‍లతో జత కట్టాలా అనే విషయాలలో స్పష్టత ఉండదు. ఒక మగవాడు తన ఈవ్‍ని గుర్తించడం ఎలా అనే విషయంలో స్పష్టత లేదు.

                                               ఈ సిద్ధాంత, వ్యాపార విస్తరనతో ముందంజలో ఉంది.  సిద్ధాంత ఆధారంగా వివాహాలు చేసుకొనే వ్యక్తులు తమ దైవమే తమను కలిపిందని విశ్వసిస్తారు. ఇతరులకు అదే చెప్తారు. మరి వారి దేవునికి సమాన శక్తి కలిగిన సైతాన్ ఈ వివాహ ప్రక్రియలో స్త్రీ పురుషుల కలయికల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటాడు. ఈ మతమార్గ శాఖాధిపతి పద్ధతుల్లో సైతాన్ వర్గం వారు ఎంత మంది ఉన్నారు. ప్రచారకుల్లో ఎంత మంది ఉన్నారు. వారు వీరి దేవుళ్ళకు వ్యతిరేకంగా ఏ విధమైన నిర్మాణ, ప్రచారాలు చేస్తారు? ఇలాంటివన్నీ అయోమయం.

25, ఏప్రిల్ 2015, శనివారం

మత సంస్థల సూత్రీకరణలు- ప్రలోభాలు



                        మత సంస్థలు ప్రజలను ఆకర్షించడానికి, వీలు కాకుంటే భయ పెట్టడానికి , వారు చేసుకున్న సూత్రీకరణ సారాంశాలను ఇక్కడ పరిశీలిస్తే అర్థం అవుతుంది. 

                   వర్తమానంలో వ్యక్తి తనకు ఉన్న సమస్యలకు కారణాలను వెతుకుతూ గతంలో తన చుట్టూ ఉన్న మానవ సంబంధాలలోకి తొంగి చూసి కార్యాకరణ సంబంధాన్వేషణ చేస్తాడు. భవిష్యత్తు ఎలా ఉంటే తాను బాగుండగలడో అంచనా వేస్తాడు. ఊహలు చేస్తాడు. ప్రతీ వ్యక్తీ సాధారణంగా చేసే పనికీ, ప్రశ్నకూ ముందే సిద్ధంగా ఉంచిన ఫలితాలు సమాధానాలు ఇలా ఉన్నాయి.

                    1. ఆత్మ మరణం లేనిది. దేహం( వ్యక్తి) దేహి ( ఆత్మ) ధరించే చొక్కా లాంటిది. దేహం ద్వారా జరిగే పనులకు ఫలితాలు ఉంటాయి. వాటిని అనుభవించడానికి పునర్జన్మ అనేది ఉంటుంది. జనన మరణాలు అనివార్యం అనేది ఒక సమాధానం. ఈ సమాధానానికి బలమైన వేదిక భారత దేశం. "గతంలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ దేహి తన దేహం ద్వారా కర్మ ఫలాలను తానే అనుభవిస్తాడు." 

ఆత్మకు మరణం లేదు. కర్మ ఫలాలు ఆత్మ నంటవు. అగ్ని దహించదు. నీరంటదు లాంటి సూత్రీకరణలు ఉంటాయి. 

                     ఈ సిద్ధాంతం ఒకే కుటూంబంలోని మూడు రకాల వ్యక్తిత్వాలను దైవ, రాక్షస, మానవ గణాలుగా విభజించి మొదలవుతుంది. ఈ రకమైన విభజనను ఈ దేశ ప్రజలు ఎంత మంది ఎలా చూస్తున్నారో తెలిసిందే. దాని గురించిన పర్యావసానాలు ఇక్కడ అప్రస్తుతం. 

                     ఈ విభజనలోని దైవ, రాక్షస, మానవ వ్యక్తిత్వాలు నిజానికి ఒక అణువులోని మూడు విరుద్ధ గుణాలు తప్ప మరేమీ కాదు. ప్రతీ భౌతిక కుటుంబంలో ఈ మూడు రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. 

            సత్యం విషయంలో ఇష్టం, అయిష్టం అనేవి ఉండవు. 
అసత్య విషయంలోనే ఇష్ట, అయిష్టం , అంగీకారం, వ్యతిరేకత, వాదన, ప్రతి వాదనలు ఉత్పన్నం అవుతాయి.

                వీరికి స్వర్గం, నరకం, వైకుంఠ ప్రాప్తి, మోక్షం, దైవంలో లీనం అయిపోవడం, నీచ స్థితినికలిగిన జన్మ లెత్తడం లాంటి అనేక భవిష్యత్తులు ఉన్నాయి.

                   గతాన్ని, భవిష్యత్తును చూపి వర్తమానంలో వ్యక్తులను భయపెట్టి, భ్రమ పెట్టి, ప్రలోభపరచి, హింసించి, సంహరించి, అదుపులో పెట్టుకోవాలని చూడడం వీటి చరిత్ర, ఇది వర్తమానం.

మత ప్రచారం.




                  మనం సరిగ్గా గమనిస్తే ఇలా ప్రచారం చేయడం అనే ప్రక్రియ, అల్పమైన భౌతికావసరాలు తీర్చే కంపెనీలు చేసే ప్రచారాన్ని పోలి ఉంటుంది.

                 సబ్బులు, కండోమ్‍లు, వాహనాలు, బట్టలు మొదలైన వస్తువులు అమ్మే కంపెనీల ప్రచారాలకూ; మతం, మార్గం, జీవన విధానం అంటూ ప్రచారం చేసే సంస్థలకూ బేధం లేదు.

ప్రచారం అనే ప్రక్రియ అస్త్యం, అధర్మం యొక్క అవసరం.
సత్యానికీ, ధర్మానికీ, దైవానికీ  ప్రచారం అనేది అవసరం లేదు.

                  నేడు, సత్యం, ధర్మం, దైవం అనేవి తెలుసుకోవలసిఅన్ పదార్ధాలే తప్ప, ప్రచారం పొంది, మార్కెట్ వృద్ధి చేసుకోవలసిన పదార్ధాలు కావు. పైగా వాటిని తెలుసుకున్న మరుక్షణం చీకటిలోకి వెలుతురు ప్రసరించినట్టుగా, అంతకు ముందు జరుగుతున్న ఈ దుష్ట వ్యాపారం నిలిచి పోతుంది, నశిస్తుంది. 

                     ఇలాంటి సంస్థల అంతిమ లక్ష్యం ధన సంపాదన, రాజ్యధికారం. దేవుని రాజ్యంలోకి ప్రవేశం, స్వర్గంలోకి మోక్ష సిద్ధి, జన్మ రాహిత్యం, నిత్యానందం, దుఃఖ రాహిత్యం, అమరత్వం, సమ సమాజం- ఇలాంటి పదాలన్నీ వ్యక్తీ అనే చేపని పట్తడానికి మత( ఆధ్యాత్మిక) వ్యాపార సంస్థల గేలానికి గుచ్చిన ఎరలు. ప్రతీ వ్యక్తీ ఏదో ఒక వ్యాపారానికి దొరక్క పోడు కదా!

23, ఏప్రిల్ 2015, గురువారం

మత వ్యాపార సంస్థలు



                                ఏ సిద్ధాంతం అయినా ఒక మతంగా, ఒక వ్యవస్థగా నిలిచి అభివృద్ధి చెందడం అనేది మానవ అస్థిత్వం అంటే ఏమిటి? అది ఎలా ఉంది? ఎలా ఉండాలి? అనే ప్రశ్నలకు అది ఇచ్చే జవాబులపై ఆధార పడి ఉంటుంది. తను చేసిన సూత్రీకరణలనే "సత్యమ"నీ, "అంతిమ గమ్య స్థానమ"నీ ప్రజలను నమ్మించగలగాలి.
                  అంటే వ్యక్తులు( ఆడ , మగ) ఎందుకు పుడుతున్నారు? ఎందుకు జీవిస్తున్నారు? ఎందుకు మరణిస్తున్నారు? మరణం తర్వాత ఏమిటీ? పుట్టూకకు ముందు ఏముంది? మరణం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఎలా జీవిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? జీవితం ఇలాగే ఉండడానికి కారణాలు ఏమిటీ? ఎందుకు? ఆరోగ్యం, ఆనందం ఎలా ఉంటాయి? ఎలా వస్తాయి? ఎలా పోతాయి లాంటి ప్రశ్నలకు సమాదానం  చెప్పగలగాలి? అప్పుడే అది ఒక మతంగానూ, మార్గంగానూ, ఒక జీవన విధానంగానూ ఆశ చూపి కొందరు ప్రజలను ఆకర్షించి తమ నిర్మాణంలో ఇముడ్చుకొనగలదు. 

                   ఈ ప్రక్రియ వలనే గతంలో, వర్తమానంలో అనేక సిద్ధాంతాలు ఆధారంగా మతాలు, మార్గాలు, జీవన విధానాలు, వ్యవస్థీకృతమై ఉన్నాయి. సిద్ధాంత ఆధారిత వ్యవస్థలు మా సిద్ధాంతమే సరియైనది, సత్యమైనది అని ప్రచారం చేసుకుంటూ , ఇతర సిద్ధాంతాలను వెక్కిరించుకుంటూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటాయి.

22, ఏప్రిల్ 2015, బుధవారం

శివ పార్వతుల భవిష్యత్తు



               ఇలా ప్రకృతిని (స్త్రీ) విడిచి సంపద, అధికారం వైపుకు సాగిన ఆత్మ, అభివృద్ధి తన ప్రారంభం మరచి ముందుకు సాగింది. కాలుష్య బంధాల పీడ నుండి పరిష్కారంగా మొదలైన సన్యాసం కాలుష్యాన్ని మరింత పెంచి, పటిష్టమైన బంధిఖానాలు సృష్టించి అందులో నుండీ ఎలా బయట పడాలో దిక్కు తోచక గింజుకుంటుంది.

                సన్యాసం సృష్టించిన ఈ సంక్షోభానికి ఆది, అంతం ఒక్కటే. సకల సన్యాస వ్యవస్థలకి మూల పురుషుడైన శివుడు, మూల ప్రకృతియైన పార్వతులే ఈ సమస్యకు ఆది, అంతం.

           సృష్టి నిర్మాణంలో కీలక బాధ్యతలను నిర్వహించవలసిన ఈ జంట కలయికను నిరోధించడం ద్వారా మొత్తం అన్ని రకాల మత సన్యాస, వ్యవస్థలు అస్తిత్వంలో ఉన్నాయి.

                    18 శక్తి పీఠాలుగా, ద్వాదశ జ్యోతిర్లింగాలుగా రావణుడి పాలయిన ఆత్మ లింగంగా - ఇలా అనేక రకాలుగా ధ్వంసం అయిన ఈ శక్తి స్వరూపాలు,  తమ వ్యక్తిత్వంలో భాగమైపోయిన పరాయి వ్యక్తిత్వాలు గంగ, నాగుడు, చంద్రుడు లాంటి కాలుష్యాలను తొలగించుకొని స్వచ్చమైన వ్యక్తిత్వాలతో బంధరహిత స్థితిలో ఒకరినొకరు గుర్తించి కలవాలి . లేకపోతే ఆ శక్తులే వినాశకారులుగా పరిణమిస్తున్నాయి. ధర్మ బద్ధంగా జీవించక పోతే శివ పార్వతులే నాశనం అయ్యే స్థితిలో వారున్నారు. తక్షణ సమీప భవిష్యత్తే ఈ అంశాన్ని తేలుస్తుంది.

21, ఏప్రిల్ 2015, మంగళవారం

స్త్రీ కోసం యుద్ధాలు




                             స్త్రీ కోసం యుద్ధాలు జరిగాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక స్త్రీలో లేనిది మరో స్త్రీలో ఏముంటుంది? ప్రతీ స్త్రీకీ ఒకప్రత్యేకత ఉంటుందని ముందే చూసాం కదా! ఒక ( హోలీ ఫ్యామిలీ) కుటుంబానికి మూలమైన ప్రకృతి స్వరూపమైన అమ్మాయి కోసం యుద్ధం అంటే ఇప్పుడు, ఆ యుద్ధం వెనుక వాస్తవాన్ని సులభంగా గ్రహించగలం. ఆ అమ్మాయి, కేవలం ఆ అమ్మాయి కాదు. ఆమె ఒక శక్తి స్వరూపిణి అని. యుద్ధం చేసేవాడు కేవలం ఆ అమ్మాయి కోసం కాక, మహాశక్తి కోసం- తద్వారా ఆకుటుంబం మొత్తం తన ఆధీనంలో ఉంచుకోవడం కోసం యుద్ధం జరిగింది అని మనం గ్రహించగలం.

                            ఆ అమ్మాయిని చేసుకోవడం వలన ఆ కుటుంబం, ఆ ఊరు  బాగుపడిందనో, నాశనం అయిపోయిందనో, లేదా పాప పుట్టడం, బాబు పుట్టడం వలన కూడా ఈ మార్పులు జరిగాయి వంటి  మాటలు సాధారణంగా వినే ఉంటారు కదా!

                ఇంత వివరం ఎందుకంటే సన్యాసికి అదనపు శక్తి సామర్ధ్యాలు ఎలా సమకూరుతాయో మనం గ్రహించడానికే.

                   అలా అదనపు శక్తి సామర్ధ్యాలు సంపాదించిన సన్యాసులు- ఉన్న దానిని వీలైనంత ధ్వంసం చేసి, కొత్త సృష్టులు మొదలు పెట్టారు. కొత్త విధానాలు, వ్యవస్థలు, రాజ్యాలు నిర్మించారు. నేటికీ వ్యవస్థలను శాసిస్తున్నది సన్యాసులే, మత సంస్థలే.

20, ఏప్రిల్ 2015, సోమవారం

సన్యాసి చేసే దుర్మార్గాలు 2



              ఈ ప్రయాణంలో సన్యాసికి అదనపు శక్తులు, బలం అవసరమవుతాయి. అదీ తీరుతుంది. ఎలాగో చూడండి!

         సన్యాసం తీసుకున్న వ్యక్తి యొక్క ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ పరిస్థితి ఏమిటి?

                             ఆమె అవసరాలు తీర్చవలసిఅన్ మగవాడూ సన్యాసం తీసుకుంటే ఆమె సహజమైన అవసరాలు ఎలా తీరుతాయి? ఈ సమస్యకు ఒక పరిష్కారంగా పర స్త్రీకి చెండిన మగవానికి రెండవ భార్య కావడం, లేదా వాడిని సొంతం చేసుకోవడం లాంటి చర్యలు మొదలయ్యాయి. దీని ఫలితంగా కొత్తగా ఒప్పందాలు, ఘర్షణ, హింస లాంటి చర్యలు వ్యక్తుల మధ్య మొదలయ్యాయి. 

                     ఏదో విధంగా పర పురుషుడిని చేరిన స్త్రీకి అదనపు బలం, శక్తి అందుబాటులోకి వస్తాయి. ఇక సన్యాసికి కూడా అదనపు బలం శక్తి అందుబాటులోకి వచ్చేసింది కదా!

                            స్త్రీ పురుషుల కలయిక ద్వారా అదనపు శక్తి, బలం అందుతుంది అనేది అర్థం కావడానికి రెండు చిన్న ఉదాహరణలు చూద్దాం. ఈ విషయాన్ని పాఠకుడు కొత్తగా ఆలోచించడానికి ఉపయోగ పడుతుంది.
 వివాహం తర్వాత జత కలిసిన ఇద్దరి వ్యక్తుల సరీరాలలో మార్పు వస్తుంది. కొందరిలో స్వల్పంగా ఉంటే, కొందరిలో అధికంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాతా బాగా మారిపోయారు అని అనడం, చూడ్డం మనకు తెలిసిందే.! రెండు వేరు వేరు పదార్ధాలు కలిసినపుడు కొంత కొత్తదనం, కొత్త స్వరూపం సంతరించుకోవడం అనే మార్పు సహజమె కదా! బలహీనులు అదనపు బలాన్ని సంతరించుకోవడం; బలవంతులు బలహీన పడిపోవడం; ఆడుతూ పాడుతూ చలాకిగా ఉండే వారు వారి దేహమే వారికి భారమై పోవడం లాంటివన్నీ మన జీవితంలో అనుభవంలో ఉన్నవే. 

                             కాకపోతే ఈ మార్పులు ఇందుకే జరుగుతున్నాయి అని అంగీకరించడం సమాజానికి ఇష్టం లేక పోవడం, లేదా ఈ వాస్తవం మరుగున పడీ తెలియుఅక పోవడం అనేది ఉండవచ్చు. 

18, ఏప్రిల్ 2015, శనివారం

సన్యాసి చేసే దుర్మార్గాలు



                     ఒక వ్యక్తి సన్యసించడం కోసం చేసే కఠోర సాధనాల వెనుక ఉన్న దుర్మార్గం గురించి ఇక్కడ తెలుసుకోవాలి. ఒక యూనిట్‍లోనూ, కుటుంబంలోనూ, అవిభాజ్యమైన వ్యక్తి నిద్ర, ఆహారం తగ్గించి; లేదా మానేసి కఠోర సాధన చేయడం మొదలు పెడతాడు.


                 ఈ సాధనలో వ్యక్తి సాధించవలసినది దేహపరమైన సంవేదనలు అయిన ఆకలి, విశ్రాంతి, కామం, నిద్ర, మనస్సు పరమైన ఆలోచనలు - ఇలాంటి వాటిని తన అదుపులోనికి తెచ్చుకోవడం ముఖ్యం. వీటి కంటే వ్యక్తి యొక్క రెండో సగం ( స్త్రీ గానీ పురుషుడు గానీ) యొక్క ఆకర్షణ శక్తికి లోను కాకుండా తనను తాను ఉంచుకోగలగడం అత్యంత ముఖ్యమైన విషయం.

                   ఒక వ్యక్తి భోజనం చేయక పోతే ఆ లోటు మొదట అతని సొంత స్త్రీ పైన ఆ భారం పడుతుంది. ఆమె అదనంగా ఆహారం తీసుకోవలసి వస్తుంది. తర్వాత ఆ లోటును ఆ వ్యక్తి యొక్క యూనిట్ సభ్యులైన మిగిలిన నలుగురు కూడా భర్తీ చేయవలసి వస్తుంది.

                     ఆ వ్యక్తి నిద్ర మాని సాధన చేయడం మొదలు పెడతాడు. దానికి కావలసిన శక్తి , బలం తన యూనిట్ నుండే అతనికి అందుతూ ఉంటుంది. అతడి స్త్రీతో పాటు యూనిట్ సభ్యులకూ కలత కూడిన నిద్ర, నిద్ర లేచిన తర్వాత రాత్రంతా పని చేసి న ట్లు అలసట అనేవి వారికి అనుభవంలోకి వస్తాయి.

               ఈ కొత్త పరిస్థితి వలన వ్యక్తిలో యూనిట్ లో కుటుంబంలో ఘర్షణ మొదలవుతుంది. వ్యక్తి అందుబాటులో ఉంటే ఇది భాహ్యంగానే జరుగుతుంది. ఆ వ్యక్తి ఈ భాహ్య సంఘర్షణ నుండి తప్పించుకొని సుదూర తీరాలకు పోయి ఉంటే ఈ  ఘర్షణ  అంతర్గత ఘర్షణగానే కొనసాగుతుంది.

 "మొండి వాడు రాజు కన్నా బలవంతుడు" - ఈ సామెత ఇలాంటి వారి వల్లనే పుట్టింది. తన యూనిట్ సభ్యులైన స్త్రీ, పురుషుల ( ఆత్మ, ప్రకృతి) శక్తితో; వారితోనే రేయింబవళ్ళు ఘర్షణ పడే అతనితో యూనిట్ సభ్యులు రాజీ పడి పోతారు. అతడిని పూర్తిగా వదిలేస్తారు ఘర్షణ పడకుండా.

ఎందుకంటే మిగిలిన వారు జీవనం కోసం శ్రమించాలి. కుటుంబ పోషణ, రక్షణ చూసుకోవడం లాంటి బాధ్యతలు ఉంటాయి కాబట్టి. వీరికున్న ఈ బలహీనత సన్యాసి కాదలచుకున్నవ్యక్తి యొక్క బలం.

సన్యాసి ఒక మెట్టు అధిరోహించాడు. తన యూనిట్ నుండి శారీరక, మానసిక, ఆత్మిక అవసరాల కోసం ఇబ్బంది పెట్టకుండా ఒప్పందం కుదుర్చుకొని మొత్తం యూనిట్ ను తన అదుపులోకి తీసుకుంటాడు. సన్యాసం తీసుకున్న వ్యక్తి యొక్క ఆత్మ ఇక, విరామం, విశ్రాంతి లేకుండానూతన నిర్మాణం మొదలు పెడతాడు. దానికవసరమైన నూతన విఙ్ఞాన ఆర్జన చేయడం ప్రారంభిస్తుంది

సన్యాసం దేనికీ పరిష్కారం కాదు



                        ఈ భ్రమ తర్వాత సంసారం అనే బంధాలు ఉన్న వ్యక్తులకు కూడా వ్యాపించింది. "సత్యం" ఎలాగూ బంధింపబడి; నిజమైన స్త్రీ, పురుష సమానత్వం సమాధి చేయబడింది. స్వభావంలో స్త్రీ ఆధిపత్య సమాజమైనా; మగవాడి చేతిలో దోపిడి, పీడనకు గురవుతున్న స్త్రీ కూడా ఈ అత్యున్నత భ్రమలో పోటీ పడుతున్నది. కొందరు అమ్మగార్లు తయారై దేవతలుగా పూజలందుకుంటున్నారు. 


                            అన్ని రకాల సన్యాస/ ఆశ్రమ వ్యవస్థలు, సిద్ధాంతాలు మానవుడి యొక్క సమస్య నుండి పలలయనం చిత్తగించిన పలాయన వాదాలే తప్ప ; సన్యాసం దేనికీ పరిష్కారం కాదు.

సన్యాసుల దగ్గర ఏదో ఉందని వెళుతున్న, భజన చేస్తున్న ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలిసింది ఏమీ లేదు.

17, ఏప్రిల్ 2015, శుక్రవారం

సన్యాసుల గొంతెమ్మ కోరికలు



                         ప్రకృతి పురుషుడి  భోగ వస్తువనే భావన కూడా జనంలో పాతుక పోయి ఉంది.

                                          ప్రకృతి స్వరూపం అయిన భౌతిక దేహమే లేని స్థితి నుండి, జనన, మరణ చట్రం నుండి, శాశ్వతంగా తప్పించుకోవాలనీ, అమరత్వం సంపాదించాలనీ ఇలాంటివెన్నో  అసాధ్యమైన గొంతెమ్మ కోరికల్తో సన్యాసులు జీవిస్తున్నారు. ఈ కోరికల వికృత ఫలితాలను గుర్తించగలిగే భౌతిక దృష్టి వీరికి పూర్తిగా మసక బారిపోయింది. ఈ హ్రస్వ దృష్టిగాళ్ళు, అహం బ్రహ్మస్మి, ఆయ మాత్మా బ్రహ్మ లాంటి గంభీరమైన పంచ్ డైలాగులతో "నేనే దేవుడు" అని విర్రవీగగలుగుతున్నారు.

                                         బంధాల వలన దైవాత్మ కూడా మిగిలిన అన్ని ఆత్మలలోనూ ఎంతో ప్రతిఫలిస్తుంది. సెంటు పూసుకున్న వాడిని కౌగిలించుకుంటే మనకూ సెంటు వాసన అంటుతుంది. అలాగే వ్యక్తి తాను ఫలానా వ్యక్తిత్వం కలిగిన, ఆత్మ స్వరూపమైన జీవిని అన్నది మరచిపోయి చాలాకాలమే అయిపోయింది అందుకే, అంటుకున్న సెంటులా తనలో ప్రతిఫలించే దైవ పదార్ధాన్ని గుర్తించి తానే దైవం అనీ, లేదా తాను కూడా దైవమే అనే అత్యున్నత భ్రమలో నేడు సన్యాసి బతుకుతున్నాడు.

16, ఏప్రిల్ 2015, గురువారం

సన్యాసం ఉనికిలోకి తెచ్చిన భ్రమలు



                     అయితే సన్యాసం ద్వారా కొన్ని భ్రమలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో మచ్చుకు కొన్ని-

- దైవాన్ని తెలుసుకోవడం, దైవంలో "ఐక్యం" కావడం
- ఈ విశ్వం అనే బంధం నుండి "మోక్షం" సంపాదించడం
- మానవ స్థితి నుండి "దైవత్వం" అనే స్థితికి ఎదగడం.
- సర్వం త్యజించి, భౌతిక, తుచ్చమైన రాగ, ద్వేషాలకు అతీతంగా "నిత్యానంద" స్థితిని అనుభవించే స్థాయికి చేరడం.
- లోక కళ్యాణం కోసం

            సన్యాసం ఎందుకు తీసుకున్నారు, అనే ప్రశ్నకు సమాధానంగా ఇలాంటివి ప్రచారంలో ఉన్నాయి. 

                      వాస్తవం ఏమంటే- సన్యాసులు స్త్రీ ద్వారా భౌతిక బంధంలో చిక్కుకోకుండా వారి శక్తిని వినియోగించుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో ఆత్మ యొక్క బలాన్ని పెంచుకుంటూ, పూర్తిగా తమ ఆధీనంలో ఉండే ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు. ఈ రకమైన అభివృద్ధి ఫలితంగానే ప్రకృతి తీవ్ర విధ్వంసాలకు గురవుతూ, పతనం అవుతోంది. ఓ పాత చైనా సామెత ఈ సన్యాస వ్యవస్థకు సరిగ్గా సరిపోతుంది. అది ఏమంటే- "వేరు శూన్యం, కాడ సన్నం, ఆకు మందం"

15, ఏప్రిల్ 2015, బుధవారం

ధర్మ బద్ధమైన సమాజంలో ఏ ఆధిపత్యానికీ చోటు ఉండదు



                         "బలము- శక్తి" సమాన స్థాయిలో ఉన్నప్పుడే "అదుపు" అనేది ఉంటుంది. మగవాడు బంధాలలో చిక్కుకోకుండా తప్పించుకోవడం ద్వారా, బంధాలలో ఉన్న మగవారిలో "అధిక శక్తి" ప్రవాహం అనేది యాంత్రికంగా జరుగుతుంది. ఈ క్రమంలో "స్త్రీ లక్షణాలు" సమాజంలో "ఆధిపత్య స్థానానికి" చేరుకున్నాయి.


                     మగవాడు తనవే అయిన ప్రత్యేక లక్షణాలు ఏమిటి అనేది గ్రహించలేని స్థితికి చేరిపోయాడు. జంతువులు, పక్షులు, చేపలు లాంటి జంతుస్థాయి బాధ్యతలు; పిల్లల్ని కనడం, పెంచడం, రక్షించడం లాంటివి మగలక్షణాలు కదా అనే స్థాయికి చేరిపోయాడు.


              ప్రస్తుత సమాజం పురుషాధిపత్య సమాజమనే భ్రమలో మగవారు బతుకుతున్నారు. నిజానికి ఇది ప్రకృతి, స్త్రీ ఆధిపత్య సమాజం. ధర్మ బద్ధమైన సమాజంలో ఏ ఆధిపత్యానికీ చోటు ఉండదు. ప్రకృతీ పురుషుల సమన్వయం మాత్రమే ఉంటుంది.  ఆధిపత్యం అనే పదార్ధానికి అధర్మమే ఆహారం, ఆశ్రయం.

14, ఏప్రిల్ 2015, మంగళవారం

సన్యాసం



                                    బంధం యొక్కఫలాలు, దోపిడి, పీడన, కోరికలు, దుఃఖం, అనారోగ్యం మొదలైనవి వాటి నుండి తప్పించుకోవడానికి వ్యక్తి ఒక ఆయుధాన్ని కనిపెట్టాడు . అదే- "సన్యాసం."

                             పరాయి స్త్రీ, పురుషులతో లైంగిక సంపర్గం ద్వారా ఏర్పడే భౌతిక బంధం నుండి తప్పించుకొని, తమ అస్థిత్వాలను ఎంతో కొంత కాపాడుకోవడం అనే అవసరం సృష్టించిందే "సన్యాసం". మొదట మగవారే ఉన్న ఈ సన్యాస వ్యవస్థలోకి తరువాత స్త్రీలు కూడా వచ్చి చేరారు. ఈ సన్యాస వ్యవస్థ వెనుక అభివృద్ధి చెందిన ఇంకో చెడు ఏమంటే - వ్యక్తి యొక్క జీవిత కాలంలో అనేకులతో సెక్సు ద్వారా జీవితాన్ని పంచుకోవడం, తప్పుడు వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం.

                   పంచుకోవడం, పెంచుకోవడం అనే ఈ ప్రక్రియ ద్వారా "బుద్ధి, విచక్షణ" లాంటి "మగ లక్షణాలు" తీవ్ర స్థాయిలో క్షీణించడం మొదలైంది. అలాగే స్త్రీలలో కూడా ప్రేమ, ఆప్యాయత, తెలివి, ఙ్ఞాపక శక్తి లాంటివి క్షీణించడం మొదలైంది. ఎందుకంటే సామర్ధ్యానికి మించిన "శక్తి" , శక్తికి మించిన సామర్ధ్యం పరాయి వ్యక్తిత్వాల ద్వారా అందుబాటులోకి రావడం ద్వారా వ్యక్తులు అదుపు తప్పి పోతారు. కలుషిత వ్యక్తిత్వాల, బంధాల ద్వారా స్వీయ నియంత్రణ కోల్పోవడం కూడా ఒక ఫలితం.

13, ఏప్రిల్ 2015, సోమవారం

"బంధమే కోరికలకు మూలం" "కోరికలే సమస్త అనర్ధాలకు మూలం"





వ్యక్తి తన సొంతమైన దానిని వదులుకొని ఆ స్థానంలోకి  మరొక పదార్ధాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించడం వల్లనే ఈ స్థితి వచ్చింది. ఎలాగంటే  x  అనే వ్యక్తి, y అనే వ్యక్తి నుండో, a అనే వ్యక్తి నుండో లోటును పూడ్చాలి అని కోరుకుంటే, దానికి వారు సహకరించినపుడు, x  దానిని తస్కరించి అయినా లేదా, బంధం ద్వారా తాను పొందే అధిక శక్తి, సామర్ధ్యాలతో వారిపై దాడి చేసి అయినా తెచ్చుకోవాలి అన్న ఆలోచన x కు పుడుతుంది. నష్టం ఉండే వ్యాపారం ఎవ్వరూ చేయరు కదా!

నేడు సమాజంలో మనం చూస్తున్న సమస్త రుగ్మతలూ బంధం ద్వారానే వ్యవస్థీ్కృతం చేయబడ్డాయి. అందుకే నేడు సమాజంలో రుగ్మతలకు ప్రజల నుండి బహిరంగంగానో, రహస్యంగానో మద్ధతు ఉంటుంది. మరీ నీచమైన పనులను కూడా కొందరు ఎందుకు సమర్ధిస్తారు అని అమాయక మేధావులు తలలు పట్టుకుంటుంటారు. వారికి తెలియని కారణం బంధం యొక్క స్వరూపం. దాని ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య, నష్టపోయే వారి సంఖ్య ఎంత ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అది ఒక్కోసారి కోట్లాది జనాభాగా ఉంటుంది.

నాది అనేది ఏదైనా నా నుండి వేరైనా, నాది కానిది ఏదైనా నాతో చేరినా, అది బంధం అవుతుంది. వ్యక్తికి లాభం, నష్టం అనేవి బంధం ద్వారా మాత్రమే కలుగుతాయి.

"బంధమే కోరికలకు మూలం"
"కోరికలే సమస్త అనర్ధాలకు మూలం"


 

11, ఏప్రిల్ 2015, శనివారం

బంధం- పర్యావసానాలు -2


                                     



                                బంధం ద్వారా వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. పర వ్యక్తిత్వాన్ని తన "స్వంతం" చేసుకుంటాడు. ఇలా అనేక వ్యక్తిత్వాల "సమ్మేళనం" ద్వారా వ్యక్తిలో "సంఘర్షణ" అనేది మొదలవుతుంది. మానసిక ఒత్తిడి ,సంఘర్షణ ఫలితంగా వ్యక్తి తాను చేయదలుచుకున్న పనులు చేయడానికి "తీవ్రఘర్షణ" పడుతుంటాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే- వ్యక్తి తన శక్తి సామర్ధ్యాలతో పని చేయడం మానేసి, తాను కోరుకొనే పనులు చేయడం మొదలు పెట్టాడు. కోరిక అనేది ఇంకొకరి కోరికకు ఆటంకంగా పరిణమిస్తుంది. అప్పుడు కోరిక తీర్చుకోవడానికి వ్యక్తి అంతర్గత ( మానసిక, ఆత్మిక, ప్రకృతి పరమైన) ఘర్షణ పడతాడు. ఇది తరుచుగా భాహ్య ఘర్షణలకు, యుద్ధాలకు మూలం అవుతుంది.

బంధం- పర్యావసానాలు



                      "బంధం"లోకి ప్రవేశించే "వ్యక్తిత్వాలు"  గాఢమైన చీకటి ప్రపంచంలోకి అడుగు పెడతాయి. ఈ బంధాలన్నీ ఆడ, మగల "లైంగిక కలయిక" ద్వారానే జరుగుతాయి. ఈ బంధాలు క్రమంగా అభివృద్ధి చెందుతూ అనేక రకాలుగా విస్తరించాయి. ఇది ఎంతగానంటే ఈ "బంధాల బలానికి బంధాలు సృష్టించిన వారే నలిగి నాశనమయ్యే స్థితికి చేర్చేంతదాకా"!

                             బంధ స్వరూపాలు  కూడా దైవత్వంగా, సత్యంగా, ధర్మంగా చెలామణి అవుతున్నాయి. ఈ బంధ స్వరూపాలు అధర్మ, దుష్ట, సైతాన్ స్వరూపాలుగా గుర్తించాలి. బంధంలో స్వచ్చతను, పవిత్రతను, నీతి, నిజాయితీలను ఆశించడం; శాంతి సుఖాలను, ఆనందాలను ఆకాంక్షించడం అంటే- నోటుతో ఓటు కొనే రాజకీయ నాయకుడి నుండి అవినీతి రహిత పాలనను ఆశించడమే!

బంధం- వైద్యుడు- అనారోగ్యం అనేవి ఒకే కాన్పులో పుట్టిన పిల్లల్లాంటివి. బంధం, వైద్యం నశించకుండా అనారోగ్యం నశించదు. వైద్యుడు "దోపిడీ" ప్రక్రియకు ప్రధాన "సేవకుడు"

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

బంధ స్వరూపం



                                 గణిత శాస్త్రంలో త్రికోణంగా పిలవబడేదే మొదటి "బంధ స్వరూపం". ఈ మొదటి "బంధం" భారతీయులకు చిరపరిచితమైన మంత్రంగా ఉంది. అదే- 

ఓం + నమః + శివాయః

                                          ఈ ముగ్గురి వ్యక్తిత్వాల కలుషిత బంధ రూపమే ఈ "మంత్రం". మంత్రం అనేది ఆ వ్యవస్థ( సిస్టం)ను చేరే "పాస్ వర్డ్" లాంటిది. ఇలాంటివి అనేకం , అనేక వ్యక్తుల బంధాల ద్వారా ఏర్పడ్డాయి. ఈ బంధాలు ఆది భౌతిక( కృష్ణపదార్ధం) బ్లాక్‍మని బ్యాంకులు.  అక్రమ సంపాదనలకు అడ్డాలు ఇవి. భౌతిక విశ్వంలో మానవుడు గుర్తించగలైగిన బ్లాక్‍ హోల్స్ కు ఈ బంధాలే ఆధారం. ఈ బంధాలే బ్లాక్ హోల్స్( కృష్ణ బిలాలు) సృష్టి కర్తలు. బ్లాక్ హోల్స్ గురించి ఎంతో కొంత తెలుసు కాబట్టి, వాటి గురించి ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం. కానీ, వాటి స్వరూప స్వభావాలకు  భూమి పైన ఉన్న మానవ సంబంధాలకు ఉన్న సంబంధం తెలుసుకుంటే చాలు. బ్లాక్ మ్యాటర్ ద్వారా తాము ఏమి చేస్తున్నామో తెలియదనే భ్రమలో బ్లాక్ హోల్ సృష్టి కర్తలు ఉన్నారు. ఎలక్ట్రాన్, ప్రోటాన్ స్వభావం కలిగిన ఆత్మ స్వరూపుల ద్వారా బ్లాక్ మ్యాటర్ ఉత్పత్తి అవుతుంది. ఇలాంటివే ఇంకా అనేక పదార్ధాలు ఉన్నాయి. యాంటీ మ్యాటర్, వైట్ మ్యాటర్ లాంటివి. అలాంటివే  వీటి గురించి ప్రస్తుత ఈ వివరాలు చాలు. బ్లాక్ హోల్స్ లాంటి స్థలాలలో ఏం జరిగింది, జరుగుతోంది అనేవి కూడా భూమిలో లాగే ఆధారాలు భద్రంగా ఉన్నాయి. 

9, ఏప్రిల్ 2015, గురువారం

బంధం అనేది అధర్మం యొక్క సృష్టి.

                             డాక్టర్ (వైద్యుడు), ఇంజినీర్ లేకుండా "బంధం" అనేది సాధ్యం కాదు. ఎలాగంటే -

   
                          వ్యక్తి యొక్క సమగ్ర స్వరూపం నుండి వ్యక్తి యొక్క సాధనాలను, ( అవి ఎముకలు కావచ్చు, వస్తు సాధనాలు కావచ్చు, వేరేమైనా కావచ్చు). ఆ వ్యక్తి ఆమోదంతో గానీ, ఆ వ్యక్తికి  తెలియకుండా, రహస్యంగానైనా, ఆ వ్యక్తి నుండి తొలగించి, బంధానికి సిద్ధం చేసేవాడు వైద్యుడు. ఆ బంధాన్ని నిర్మించేవాడు ఇంజినీర్. ఈ ప్రక్రియ వ్యక్తి యొక్క సమగ్ర స్వరూపంలోని  ఏదేని అంశంతోనైనా సాధ్యం అవుతుంది.





                                ఇలా ముగ్గురి వ్యక్తుల అంశాలతోటి మొదటి "బంధం" మొదలయింది. ఈ బంధం కలుషిత వ్యక్తిత్వాల ద్వారానే ఏర్పడింది. జరుగుతోంది. బంధం అనేది "ధర్మ" విరుద్ధమైన అధర్మ ప్రక్రియ అన్నా ఇదే. బంధం అనేది అధర్మం యొక్క సృష్టి.

8, ఏప్రిల్ 2015, బుధవారం

బంధం



                              కలుషిత మానవ సంబంధాల ఫలితంగా ఉత్పత్తి అయిన అనేక "కొత్త" పదార్ధాలలో సన్యాసం అనేది ముఖ్యమైనది. కలుషిత మానవ సంబంధంలోని కొత్తదనాన్ని కొంత అనుభవించి, ఆనందించే క్రమంలో పాతది నశింపు ప్రారంభం అవుతుంది. పాతది నశిస్తూ, కొత్తది వృద్ధి చెందే క్రమంలో కొత్తదానాన్ని పాతదానిలాగే "శాశ్వతం" చేసుకోవాలి అన్న "తపన" మనిషిలో ప్రారంభం అయింది. ఈ తపన ఫలితంగా ఉత్పత్తి అయిందే "బంధం".

                    "బంధం" అనేది రెండు, లేదా అంతకన్నా ఎక్కువ పదార్ధాలను ఇంకో పదార్ధంతో బంధించేది. మొదట ఎలక్ట్రాన్, ప్రోటాన్ స్వభావంకలిగిన వ్యక్తుల కలయిక ద్వారా ఉత్పత్తి అయిన కృష్ణ పదార్ధం ద్వారా ఈ బంధం ఏర్పడింది. ఈ బంధాన్ని సృష్టించిన వారు ప్రాథమికంగా ఇద్దరు. ఇకడు వైద్యుడూ కాగా, రెండవవాడు ఇంజనీర్. ఆదిలో వీరే మాంత్రికులుగా గుర్తించబడేవారు.

7, ఏప్రిల్ 2015, మంగళవారం

ఆనందం, తృప్తి, శాంతి, సౌభాగ్యాలకు దూరం అయిన మానవుడు.




సొంత వ్యక్తిత్వాన్ని హరించే ఈ వ్యక్తి సంబంధాల ద్వారా ధర్మం చీలికలు, పేలికలై అస్తిత్వం కోల్పోయిన బట్ట(cloth) లాగా తాయారయింది. ఫలితంగా అధర్మం ధర్మంగా చెలామణి అవుతోంది.

             వందల కోట్ల సంవత్సరాలుగా అధర్మంగా జరిగిన ఈ అభివృద్ధి అంతా రేపు ఏమవుతుంది అనేది పక్కన పెడితే, నేడు మానవుడు వ్యక్తిగా, రకరకాల అనుభూతులు పొందుతూ, అన్వేషిస్తూ, హింస పడుతూ, దేనికోసమో వెతుకుతూ, వెంపర్లాడుతూ ఉన్నాడు. రకరకాల రూపాలలో, ఇలా ఎంత వెతికినా, ఎంత అనుభవించినా, సంపాదించినా, త్యాగాలు చేసినా, సన్యసించినా దక్కనిది ఏమంటే-

వ్యక్తి సొంత జీవితంలో ఉండే "ఆనందం, తృప్తి, శాంతి, సౌభాగ్యాలు". వ్యక్తి తన సొంత జీవితానికి ఎంత దూరం అయితే ఇవీ అంత దూరం అవుతాయి.

                    ప్రతీ మగవాడూ వయోబేధం లేకుండా ప్రతీ స్త్రీ దేహాన్ని వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే- తనకు "తృప్తిని, ప్రేమని, శాంతిని ప్రసాదించి, తన వ్యక్తిత్వాన్ని కాపాడగలిగిన శక్తి స్వరూపిణి ఈమేనా?" అని. ఈ కాలుష్య సంబంధాలలో మగవాడు తన సొంత స్త్రీని నేరుగా, సూటిగా, స్పష్టంగా గుర్తించలేడు.

మగవాడు స్త్రీలను కామ దృష్టితో చూడడానికి మూల కారణం ఇదే. స్త్రీ కూడా తన శైలిలో తన సొంత మగవాడిని వెతుకుతూ, అతని కోసం నిరక్షిస్తూ ఉంటుంది. ఈ "సత్యం" తెలియక, తాము ప్రేమించిన, లేదా పెళ్ళాడిన, లేదా కామించిన ఆడ, మగల నుండి, సొంత వారి ద్వారా లభించే వాటిని ఆశించి భంగపడుతున్నారు. ఇంతటితో ఆగక ద్వేషించి , హింసించి, సంహరించేదాకా వ్యక్తుల చర్యలు ఉంటున్నాయి.

పోగొట్టుకున్నదానిని ఇలా వెతికేవారు ఒక రకంకాగా; రెండవ రకం- తమ కంపెనీలు విస్తరించి వృద్ధి చేసుకోవడానికి బ్యాలెన్స్ షీట్స్ బాగున్న వారి కోసం వెతుకుతారు. జాతకాల పరిశీలన ఈ కోవలోనిదే. ఇదంతా సరియైన జోడీ కోసం కాకుండా, మెరుగైన, బలమైన, శక్తివంతమైన వారికోసం వెతకడమన్నమాట.

సరియైన దానికి ప్రత్యామ్నాయం ఉండదు. అది ఒకే ఒకటి ఉంటుంది. ఈ ఒక్క దానికంటే మేలయినవి, అంటే- ప్రత్యామ్నాయాలు కోట్ల సంఖ్యలో ఉంటాయి. వేలం పోటీ, ఘర్షణ, యుద్ధం ఇలా ఏదో ఒక పద్ధతి ద్వారా సొంతం చేసుకుంటారు. "సొంత పదార్ధం వేరు. సొంతం చేసుకున్న పదార్ధం వేరు" .

స్వంత పదార్ధం మన నుండి ఎవరూ వేరు చేయలేనిది కాగా, సొంతం చేసుకున్నది ఏ క్షణంలోనైనా మన నుండీ వేరు పడగలిగిన స్వభావం కలిగి ఉంటుంది.

మగవారు స్త్రీలను బలవంతంగా అనుభవించడం అనే ప్రక్రియ, కేవలం మగవాడు తమ కామవాంచ తీర్చుకోవడం కోసం కాదు. ఆయా స్త్రీల శక్తిని కొల్లగొట్టడానికి, ఆ స్త్రీలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి జరిగే ప్రయత్నమే అత్యాచారం అనేది. సాధారణంగా అత్యాచారాలు చేసే వారు సాధనాలుగా ఉంటారు. వీరిని ఉపయోగించేవారు అదృశ్యంగా ఉండి, అధిక శక్తిని వినియోగించి, సాధనం ద్వారా ఈ పనిని చేస్తారు. దేవతలుగా పూజలు, ప్రార్ధనలు అందుకునే వారు ఈ ప్రక్రియను ఉపయోగించుకోవడంలో ప్రథమ శ్రేణిలో ఉన్నారు.

6, ఏప్రిల్ 2015, సోమవారం

"ధర్మబద్ధంగా వ్యక్తి జీవించడం" "వ్యక్తి ధర్మాన్ని వ్యక్తి ఆచరించడం"


                                  


                                           ధర్మబద్ధంగా ఒక వ్యక్తి జీవించడం అంటే- వ్యక్తి తన వ్యక్తిత్వం ద్వారా జీవిస్తూ, ప్రకృతి+ పురుషుడి వికాసం అభివృద్ధి చెందుతూ జీవించడమే. "ధర్మబద్ధంగా ఎప్పుడు జీవించగలడంటే - పరాయి వ్యక్తుల ప్రమేయం లేనపుడు మాత్రమే ధర్మబద్ధంగా జీవించగలడు"    


                      ఒక వ్యక్తి యొక్క సొంత ఆస్థిలోని ఏదైనా పదార్ధాన్ని తస్కరించి, మరొక వ్యక్తి తన వద్ద ఉంచుకున్నాడంటే మొదటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కొంత రెండవ వ్యక్తి తన వద్ద ఉంచుకున్నాడని అర్థం.


          ఉదా: "ధర్మం" అనే వ్యక్తిత్వం కలిగిన ఆత్మ స్వరూపుడి వ్యక్తిగత ఆస్థి నుండి ఒక కలం గానీ, ఒక వెంట్రుక గానీ, క్రోధం అనే వ్యక్తిత్వం కలిగిన ఆత్మ స్వరూపుడు దొంగిలించి దాచుకున్నాడనుకుందాం. అప్పుడు క్రోధ స్వరూపుడి దగ్గర ధర్మ పదార్ధం ఉండడమే కాదు; ధర్మం యొక్క శక్తి సామర్ధ్యం కూడా క్రోధుడి ఆధీనంలోకి వచ్చిందని అర్థం. ధర్మం పోగొట్టుకున్నది తన కలం మాత్రమే కాదు. తన శక్తి సామర్ధ్యాలను కూడా. దొంగిలించిన పదార్ధంతో వచ్చే అదనపు శక్తి సామర్ధ్యాలు కూడా. దొంగిలించిన పదార్ధంతో వచ్చే శక్తిసామర్ధ్యాలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం అనే దుర్లక్షణం సమాజంలో మొదలయింది.

                      ధర్మం అధర్మంగా పరివర్తనం చెందటంలో, అక్రమ సంబంధం మొదటి చర్య కాగా, ధర్మపు వ్యక్తిత్వం పరాయీకరణ చెందటం అనేది రెండవ చర్య.

                            వ్యక్తి తన యొక్క రెండవరూపాన్ని, సారాన్ని వదలి వేరొక వ్యక్తితో జీవిస్తూ, దానికి ధర్మాన్ని అడ్డు పెట్టుకుంటే అది వ్యక్తి ధర్మంగా, వ్యక్తి స్వేచ్చగా మారింది. వ్యక్తి యొక్క "వ్యక్తిత్వం" మరుగున పడిపోవడం, పరాయీకరణ చెందటం జరిగినపుడు అది పూర్తిగా వ్యక్తి ధర్మంగా పిలవబడుతూ, వాస్తవానికి "అధర్మం" యొక్క రూపంగా వృద్ధి చెందుతూ చలామణిలో ఉంది.

   
               వ్యక్తి ధర్మం, వృత్తి ధర్మం, సంఘ ధర్మం, కుల, మత ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, సన్యాస ధర్మాలు, గృహస్తు ధర్మాలు, పూజారి ధర్మాలు, తల్లి ధర్మం, తండ్రి ధర్మం, పుత్ర ధర్మం, వర్ణ ధర్మం ఇలా చాలా ధర్మాలు ఉన్నాయి.

                          ఇలా ధర్మం వ్యక్తుల స్వేచ్చ(స్వ+ఇచ్చ= నా ఇష్టం) వెనుక చేరడమే, ధర్మం  అధర్మంలోకి వృద్ధి చెందటం. ధర్మ బద్ధంగా నేను నాపనిని, నావ్యక్తిత్వం నిర్ధేశించే  పనిని చేస్తున్నాననే వ్యక్తి, కలుషిత బంధాల ద్వారా ధర్మం తనలోనూ వ్యక్తం కావడం ద్వారా నాధర్మం అనీ, తాను చేయవలసిన పనిని విడిచి ఎంచుకున్న పనిని చేయడాన్ని వృత్తి ధర్మం అనీ వ్యక్తి అనగలుగుతున్నాడు. 

5, ఏప్రిల్ 2015, ఆదివారం

కాలుష్యం



                        

                         పర వ్యక్తులతో కలయిక, పర వ్యక్తుల దగ్గర వ్యక్తిత్వానికి చెందిన అంశాల బందీగా ఉండటం లాంటి ప్రక్రియల వల్ల కాలుష్యం ఏర్పడి వృద్ధి చెందుతుంది.


                              పరస్పర అవగాహన ద్వారా జరిగిన "కాలుష్యం" తరువాత "బంధం" అనే ప్రక్రియలోకి మారింది. వ్యక్తి యొక్క ఏదేని అంశం దాచి, బంధించి, వ్యక్తి యొక్క అనుమతితో నిమిత్తం లేకుండా ఆ "అంశం" ద్వారా ఆ వ్యక్తి యొక్క "శక్తి - సామర్ధ్యాలను రహస్యంగా గ్రహించడం" అనే "చోరకళ" ఉనికిలోకి వచ్చి, వృద్ధి చేయబడింది.

                  
                      గుడి, మసీదు, చర్చి లాంటి వ్యాపార కూడళ్ళు ఈ చోరకళతోనే నిర్మించబడ్డాయి.

                      బంధించడం అనేది అధర్మానికి ప్రాణ వాయువు (ఆక్సీజన్) లాంటిది.

                      ధర్మ క్షీణత/ అధర్మ వృద్ధి అనేది బంధం ద్వారా జరిగింది. జరుగుతోంది.

4, ఏప్రిల్ 2015, శనివారం

మంచి కాలం, చెడు కాలం, సకాలం, అకాలం




                          నేను ఎవరు? ఎందుకు? లాంటి ప్రశ్నలు వేసుకొని ఆ వ్యక్తి అన్వేషిస్తే ఆ వ్యక్తి స్త్రీ అయితే తానొక ప్రకృతి స్వరూపిణి అనీ, మగ వ్యక్తి అయితే ఆత్మ స్వరూపుడు అనీ, ఆ ప్రకృతి, ఆత్మ కూడా - ఫలానా స్వభావం కలిగిన ప్రకృతి అనీ, ఆత్మ స్వరూపం ఫలానా అర్థం (వ్యక్తిత్వం ) కలిగి ఉన్నదనీ- ఇలా వ్యక్తి తన గురించిన పూర్తి సత్యాన్ని తెలుసుకోగలిగేలా, సత్యాన్ని అనుసరించి ధర్మబద్ధంగా వ్యక్తి జీవించడానికి కాలం అనేది సహకరించాలి.

                             ధర్మం కలుషితం కావడం ద్వారా, సత్యం మసకబారిపోవడం, అధర్మం, అసత్యం వెలుగులు విరజిమ్ముకుంటూ నింగినాక్రమించడం జరిగిపోయింది. ఈ రెండింటికి ఆధారభూతమైన కాలం కూడా మంచి కాలం, చెడు కాలం, సకాలం, అకాలం, అంటూ అనేక అంటూ అనేక రూపాల్లోకి కాలం పరాయీకరణ చెందిపోయింది.

                          ఎవరెవరి చేతిలో ఎంత కాలం ఉంది అనే దానిపైన వారి పనులు- ఎప్పుడు ఎక్కడ ఎలా నెరవేర్చుకోగలరు అనేది ఆధారపడి ఉంది. మూఢ నమ్మకాలుగా కూడా ముద్రపడిన జ్యోతిష్యం, వాస్తు లాంటి వాటి ద్వారా జరిగే వివాహాలు, నిర్మాణాలు మొదలు; అంతరిక్షప్రయోగాలు మొదలు -ఇలాంటి మూఢనమ్మకాలను వ్యతిరేకించే సిద్ధాంతవాదులుగా ప్రచారం చేసుకొనే కమ్యునిష్టులు; 1917 అక్టోబరు విప్లవాన్ని కూడా ఒక ముహూర్తంగా లెనిన్ చెప్పుకోవాల్సి రావడం వరకూ -కాలం అనేది కార్యాలకు కలిసి రావలిసిన అవసరం ఏర్పడింది. కాల పదార్ధం ఒక్కో ప్రాంతం వారికి, ఒక్కో సిద్ధాంతవాదులకు ఒక్కో విధంగా తయారవడానికి కారణం, కాలపురుషుడు కాల ప్రకృతి స్వరూపాల వ్యక్తిత్వాలు పరాయీకరణ  చెందటం అనేక స్థలాలలో సంస్థల బంధాలలో బంధింపబడి ఉండడమే కారణం. కాల పురుషుడికీ ప్రకృతికీ కాలం కలిసిరాని పరిస్థితి ఏర్పడింది.

2, ఏప్రిల్ 2015, గురువారం

సత్యం- ధర్మం -కాలం

  

                               "ఒకే వ్యక్తిత్వం కలిగిన స్త్రీ పురుషులు , ఒకరికొకరు పుట్టీ, జీవించి తమ వ్యక్తిత్వాన్ని ఏ మలినాలు అంటకుండా వికసింపజేసి,వూద్ధి చేసుకోవడం ధర్మం".


                    "ఇలా వికసింపజేసే పదార్ధమే ధర్మం". వ్యక్తిత్వానికి ఆధారమైన సత్య పదార్ధాలు(మూల పదార్ధాలు) ఒకే కాలంలో వ్యక్తిత్వపు సమస్త అస్థిత్వాలలో ఒకే వికాసం జరిగినపుడు అది పూర్తిగా ధర్మబద్ధమైన జీవితం అవుతుంది.

                                సత్యం- ధర్మం- కాలం అనే మూడు పదార్ధాలు ఒకే యూనిట్‍లోనివి. ఒకటి లేకుండా మిగిలిన రెండు ఉండవు. ఏదేని ఒక పదార్ధం యొక్క స్థితిపైన మిగిలిన రెండు పదార్ధాల స్థితిగతులు ఆధారపడి ఉంటాయి.


                             కాలం అనే నాణేనికి బొమ్మబొరుసుల్లాంటివి సత్యం, ధర్మం. ఒకరు ధర్మబద్ధంగా జీవిస్తున్నారు అంటే వారికి సత్యం తెలుసు అని అర్థం. ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, ఘర్షణ లేని, ద్వంద్వం లేని మనస్సులాంటి సుగుణాలన్నీ ఆ వ్యక్తిలో పరిమళిస్తున్నట్లు.

దోపిడి



                        ప్రకృతి వైపరీత్యాలు- భూకంపం గానీ,, తుఫాన్‍లు గానీ , అతివృష్టి , అనావృష్టి లాంటివన్నీ సాధారణంగా ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కావడం అనేది ఉంటుంది. 

ఇది ఇలా ఎందుకు ఉంటుంది అంటే- ఆ ప్రాంతం ఏదో ఒక ప్రకృతి యొక్క కుటుంబ స్థావరంగా ఉంటుంది.

ఆ ప్రకృతి కుటుంబంతో ఇతర ప్రకృతి కుటుంబాలుగానీ, కుటుంబంగానీ బంధంలోని వ్యాపార లావాదేవీలలో భిన్నాభిప్రాయాలు తీవ్రమై ఘర్షణకు దారి తీయడం లాంటివి జరిగినపుడు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి.

ఒక ప్రాంతం ఎడారిగా మారింది అంటే- దానర్థం అక్కడ ఉన్న కుటుంబం పూర్తిగా కొల్లగొట్టబడింది అని అర్థం.

x1 అనే ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు నిద్ర, 8  గంటలు విశ్రాంతి, 8 గంటలు పని చేస్తాడనుకుందాం. అదే వ్యక్తి xy-1 అనే వ్యక్తితో కలుషితం కావడం ద్వారా అదనపు శక్తి సామర్ధ్యాలు అందుబాటులో ఉంటాయి. దీని ఫలితంగా x1 అనే వ్యక్తి ఒక గంట గానీ, రెండు గంటలు గానీ అదనంగా పని చేశాడనుకుందాం. అప్పుడు y+1   అనే వ్యక్తి యొక్క పని చేసే సామర్ద్యంలోగానీ, విశ్రాంతి, నిద్రా సమయంలోగానీ లోటు ఏర్పడుతుంది. ఫలితంగా y+1  అనే వ్యక్తి పని చేయగలిగిన "సామర్ధ్యం"కుంటుపడుతుంది. ఇలా పరాయి ఆడ, మగలతో కలవడం ద్వారా శక్తి కోల్పోవడం, అదనంగా పొందడం అనే ప్రక్రియ ప్రారంభం అయింది. మొదట పరస్పర అంగీకారం, ఒప్పందంతో  ఇవి జరిగినా, నేటికవి నిరాకరించడానికి గానీ, నిరోధించడానికిగానీ "అసాధ్యం" అనే స్థితికి చేరుకొంది.

నేటి సమాజంలో ధనిక, పేద, దోపిడి, పీడన అనే వాటికి మూలాలు, "కలుషిత వ్యక్తిత్వం"లో ఉన్నవి. దీని ఫలితంగా x,y అనే వ్యక్తులు, వారి భాగస్వాములతో కలిసి, నలుగురూ తమ సొంత అస్థిత్వాలను కోల్పోవడం వ్యక్తిత్వం మరుగునపడి పోవడం అనే నూతన స్థితికి చేరుకొన్నారు.

ఈ "కాలుష్యం" అనేది ద్వంద్వం నుండి బహుళత్వం వైపు పయనించి, వ్యక్తిత్వపు మూలాలను కూడా "నాశనం" చేసే స్థితికి చేరుకొంది.

1, ఏప్రిల్ 2015, బుధవారం

ధర్మం అంటే

 
 
                     "ధర్మం" అనే "వ్యక్తిత్వం" కలిగిన( ధర్మ దేవత+ ధర్మాత్ముడు) ఆడ+ మగలను ఇతర వ్యక్తిత్వం కలిగిన ఆడ+ మగలతో సంభోగం జరపడం ద్వారా మొదట వ్యక్తిత్వాలు "కలుషితం" కావడం అనేది మొదలైంది. పరాయీకరణ, దోపిడి, అసమానతలు మొదలైనవి తర్వాత అభివృద్ధి అయినాయి. కొత్తదనం కోసమో, దుర్భుద్ధితోనో కాలుష్యం అనేది మొదలైనా ఫలితం మాత్రం పరాయీకరణ, దోపిడీ, పీడనలే.
 
                ఈ సమస్త విశ్వం అంతా "దైవం" యొక్క రెండు "అస్థిత్వాలు" కలిగిన దేహం. ఆ దేహానికి "గుండె" లాంటిది "ధర్మం". ధర్మం యొక్క విధి ఏమంటే వ్యక్తిత్వాలను సక్రమంగా నడపడమే.
 
               సొంత జీవితంలో వ్యక్తి తన సొంత సామర్ధ్యాలతో జీవిస్తాడు. కాబట్టి వ్యక్తి ఎంత శ్రమించాడో దాని ఫలితం ఏమిటో ఆ వ్యక్తికి స్పష్టత ఉంటుంది. తన కర్మలకు తానే బాధ్యుడుగా ఉంటాడు. తోటి కుటుంబ సభ్యులతోనో, ఇతర కుటుంబ సభ్యులతోనో పరస్పర సహకారం అనేది సరళంగా, స్పష్టంగా ఉండి వ్యక్తి వికాసానికీ, అభివృద్ధికీ ఏ ఆటంకం లేని స్థితి ఉంటుంది.
 
               బంధంలో వ్యక్తి బాధ్యత అనేది గందరగోళమయ్యి, ఏ చర్యకు, ఏ ఫలితానికి ఎవరు బాధ్యత వహించాలో తెలియని స్థితి ఏర్పడింది. అందుకే నేటి సమాజంలో జరిగే హింసలకుగానీ, ప్రకృతి వైపరిత్యాలకు గానీ మూల కారణం కనుగొనడం సమస్య నిర్మూలన చేయడం అనేది అసాధ్యంగా కనిపించి ప్రత్యామ్నాయాలను అన్వేషించడం మొదలు పెడతాం. ప్రతి ప్రత్యామ్నాయ మార్గం కొత్త సమస్యల సృష్టికి నాందీ ప్రస్తావన అవుతుంది.