8, జూన్ 2015, సోమవారం

ఒక్క క్షణం

                                                   


                                                                                          - ఆచార్య మేడిపల్లి రవికుమార్
                                                                                            శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం,
                                                                                                      తిరుపతి            
                                                                                                                                                                                                                                                                                                                                             
    " ఒక విధ్వంసం జరగకుండా ఒక నూతన నిర్మాణాన్నీ, గతాన్ని సమీక్షించకుండా ఒక మంచి భవిష్యత్తునూ ఊహించలేం !"

         ఏదైనా ఒక కొత్త అంశం- అది అనుభవం కావచ్చు. అనుభూతి కావచ్చు. అది జీవితానికో, సృష్టికో సంబంధించిన ఒక సిద్ధాంతం కూడా కావచ్చు - మనల్ని తట్టినప్పుడు ప్రకంపనలు తప్పవు - వేల సంవత్సరాలుగా ప్రపంచంలో జరిగింది ఇదే !
   
        ప్రతి ప్రకంపనకీ నడిమి కాలం ఒక క్షణం కావచ్చు, ఒక యుగం కావచ్చు. ఖచ్చితంగా కాలం గురించి చెప్పలేనుగానీ "ఇది" కూడా ఒక ప్రకంపనే.
   
దీన్ని ఒక గ్రంథమనో, ఒక వ్యాసమనో, ఒక సిద్ధాంతమనో, ఒక ప్రేలాపన అనో, ఒక వెర్రి ఊహ అనో చెప్పలేను - ఎందుకంటె ఎందులోనూ ఇది ఇమడదు.

    ధర్మం - సత్యం - కాలం - ప్రకృతి - పురుషుడు - వ్యక్తి - మనిషి - కుటుంబం- అణువు - పరమాణువు - శక్తి - శ్రమ - భూమి- ఈశ్వరుడు - క్రీస్తు - అల్లా ... ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి అసలైన స్వరూప స్వభావాలు, రంగు రుచీ వాసనలో ఇవి ఇలాగే ఉంటాయి గాబోలు.

    ఇది కంటితో చూసి చదివితే ఒక పట్టాన అర్థమయ్యేది కాదు - జీవితానుభవంతో దర్శిస్తేనే కొంత మేర చేరుకోగలం. ఈ ప్రక్రియ జరిగిన తరువాత మనం రిలాక్స్ కావచ్చు - కలవరపడవచ్చు - విపరీతమైన ఆకలి అవచ్చు - ఆకలి లేకపోవచ్చు - కుంభకర్ణుడి నిద్రపోవచ్చు - నిద్ర లేని రాత్రులు  గడపొచ్చు - భార్యనో, భర్తనో ఆమడ దూరంలో ఉంచొచ్చు - అమాంతంగా ఆలింగనం చేసుకోవచ్చు - ముద్దులు పెట్టవచ్చు - హద్దులు మీరవచ్చు - అద్దంలో మన శరీరాల్ని నగ్నంగా చూసుకొని గ్రీకు పురాణ నాయకుడు (NARACISSUS) లాగా మనకు మనం ముద్దాడుకోవచ్చు - మన మీద మనకే అసహ్యమేసి అద్దాన్ని పగలకొట్టవచ్చు - కొన్ని ధర్మాల్ని, వాస్తవాల్ని గుర్తించకపోతే దర్శించబోయే భవిష్యత్తు రూపాన్ని చూసి మన తలలు నేలకేసి కొట్టుకోకుండానే బద్దలు కావచ్చు - ఇంకా ఏవేవో జరగొచ్చు - అసలేమీ జరగక పోవచ్చు - ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే పై వాటిలో ఏవి జరగినా జరగకపోయినా అది దీని తప్పు కాదు. వేల సంవత్సరాలుగా మన రక్తంలో ఇంకి పోయిన, మనల్ని మన జీవితాల్ని నడిపిస్తున్న, శాసిస్తున్న భావజాలమే అందుకు కారణం.

    వ్యక్తికీ, మనిషికీ తేడా ఏమిటి ? దైవానికీ దయ్యానికీ భేదం ఏమిటి ? మార్క్స్ కూ మార్క్సిస్టులకీ వైరుధ్యం ఉందా ? స్త్రీ పురుషులు ఎవరు ? మనలో సగ భాగంగా ఉండి జీవితాన్ని పంచుకుంటున్న వాళ్ళు నిజంగా మన భార్యలు, మన భర్తలేనా ? జీవితాలు ఎందుకు దారి తప్పుతున్నాయి ? కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి ? అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి ? హత్యలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి ? వాటి వెనుక ఉన్న శక్తులు ఏమిటి ? ఇందులో ఎవరు నేరస్తులు ? జన్మనిచ్చిన వాళ్ళూ, తోడబుట్టిన వాళ్ళూ నిజంగా నీ కుటుంబ సభ్యులేనా ? ఇలాంటివి మనల్ని భయకంపితుల్ని చేసే గంభీరమైన ఆలోచనలు కావచ్చు, చొప్పదంటు ప్రశ్నలూ కావచ్చు. వీటి పట్ల మన మనస్సు కొంతసేపు లగ్నం చేయాలంటే మన శరీరానికీ, మన మనసుకూ ఎంతో శక్తి కావాలి. మరెంతో ధైర్యం ఉండాలి. వీటన్నింటినీ మించి నీ గురించీ, మనిషి గురించీ, దైవం గురించీ, ధర్మం గురించీ, ప్రకృతి గురించీ, ముఖ్యంగా "భవిష్యత్తు" గురించీ వాస్తవం తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండాలి.

    ఇందుకు సిద్ధమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే దీన్ని తెరవండి. కలిచివేసిన అంశాలు ఏవన్నా ఉంటే వాటి గురించి ఆలోచించండి. భయపడకుండా మరొకరితో పంచుకోండి. కలవరపెట్టిన అంశాలు ఏమీ లేకపోతే దీన్ని మరొకరి దర్శనంలో ఉంచండి. వాళ్ళకీ ఇదే అనుభవమైతే దీన్ని కాల్చివేయమని చెప్పండి. వీటిలో ఏది చేసినా లాభమే. నష్టం లేదు.

కామెంట్‌లు లేవు: