31, మార్చి 2015, మంగళవారం

వ్యక్తి సమస్యలు                         ఇప్పుడు వ్యక్తి సమస్యల దగ్గరకు వద్దాం. సమస్యలు ఇవి అవి అని ఇక్కడ తెలియజేయనవసరం లేదు. అవి అందరికీ తెలిసినవే! ఎదో తెలియని వెంటాడే దుఃఖం కావచ్చు. అనారోగ్యాలు కావచ్చు. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, సామాజిక, కుల, మత సమస్యలు , ఆర్థిక సమస్యలు ఇలా అనేకం ఉన్నాయి. అయితే వీటికి పరిష్కారం కోసం ఒక్కో సమస్యకి పరిష్కార మార్గాలుగా చెలామణిలో అనేకం ఉన్నాయి. కానీ వ్యక్తికి సమస్యలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

ఏ వ్యక్తికైనా అర్థం కావలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ సమస్యకైనా ఒకే పరిష్కారం ఉంటుంది. అనేకం ఉండవు అని.
                ఇప్పటికిప్పుడు మనిషికి - వ్యక్తికి వచ్చే సమస్యలు పరిష్కారం చూపడానికి లక్షలాది కారణాలు, కోట్లాది పరిష్కార మార్గాలు ప్రచారంలో ఉన్నాయి.

     దైవాలుగా ప్రచారం పొందిన విష్ణు, ఏసు, అల్లా వంటివారి నామ జపాలతో సమస్త బాధలు తీరిపోతాయని , ఆశ్రమ ధర్మాలు పాటిస్తే సమస్యలు రావని, లేదా పోతాయని, మంత్ర జపాలు చేయాలని, జాతక దోషాలు గుర్తించి వాటిని నివారించాలని, ధ్యానం, యోగా ఙ్ఞాన విద్యనభ్యసించడం, సరియైన జీవన విధానాన్ని అనుసరించడం వల్లా, వైద్యం మొదలైన వాటి ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవాలనీ- వచ్చిన వాటిని నివారించాలని కొందరు అంటుంటారు.

            ఇంకొందరు - సమాజ నిర్మాణ స్వరూప , స్వభావాలను మార్చడం ద్వారా సమస్యలను పరిష్కరించాలనీ, దానికి రామరాజ్యమే శరణ్యమనీ, సనాతన ధర్మమే మేలనీ కొందరు భావిస్తారు. భౌతిక జీవితం తుచ్చమై పాప పంకిలమని భావిస్తారు. స్వర్గం, జన్మ రాహిత్యం, పరలోక రాజ్యం మొదలైనవి అన్నీ- ఇలా అనేక మార్గాలను కొందరు ప్రచారం చేస్తుంటారు. కుల, మత రహిత సమాజం ద్వారా ఇది సాధ్యమనీ, లేదా సమసమాజం( కమ్యూనిజం) ద్వారా ఇది సాధ్యమనీ ఇలా అనేక రకాల సిద్ధాంత రాద్ధాంతాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. వీటి వలన  వ్యక్తి యొక్క సమస్య మూలాలను గ్రహించలేని స్థితి నెలకొని ఉంది. ఏది సరైన మార్గమో, ఎవరు సరైన నాయకుడో, గురువో, దైవమో తేల్చుకోలేని అయోమయ స్థితి ఉంది. గుళ్ళు, చర్చీలు, మసీదులు, ఇలా అనేక స్థలాల్లో తమ సమస్యలు తీరాలని మొక్కే వారు, ప్రార్ధించేవారు అనేకులు ఉన్నారు. 

            వ్యక్తి తన "సమస్య " ఏమిటో తెలియక పోవడం వల్ల, తెలుసుకునే ప్రయత్నం చేయక పోవడం వల్ల , తప్పుడు అవగాహనతో, తప్పుడు మార్గాలలో పరిష్కారాలను వెతుకుతున్నాడు. దాని వలన తప్పుడు మార్గాలు, తప్పుడు ఙ్ఞానం పెరిగిపోయి అందులో చిక్కుక పోయాడు. ఎంతగానంటే సమస్యలు పరిష్కరించాలని మానవాళి అంతా ప్రయత్నించినా సాధ్యం కానంత సంక్లిష్ట స్థితిలో కూరుక పోయాడు.
                      ఇలా ఎందుకు జరిగిందంటే ధర్మం క్షీణించడం, వ్యక్తిత్వం కలుషితం కావడం, పరాయీకరణ చెందడం, దోపిడీకి గురికావడం, దోపిడీ చేయడం అనే ప్రక్రియల ద్వారా ఇది జరిగింది.