28, మార్చి 2015, శనివారం

స్వేచ్చ

        


                                     నేడు చలామణిలో ఉన్న వ్యక్తి స్వేచ్చ అనేది తప్పుడు భావన, అర్థ రహితం.

                స్వ+ఇచ్చ= స్వేచ్చ, ఆంగ్లంలో Freedom, స్వ అనగా నా; ఇచ్చ అంటే ఇష్టం - నా యొక్క ఇష్టం. అదేమిటో తెలియాలంటే "నేను" అనే పదార్ధం ఏమిటో తెలిసుండాలి. అంతేగాని తాగి తిరగడం, నచ్చిన స్త్రీ, పురుషుడితో కోరుకున్నట్లు తిరగడమో , నచ్చిన సిద్ధాంతాలనూ, దేవుళ్ళనూ, నమ్మడమో కాదు స్వేచ్చ అంటే.
స్వేచ్చ అంటే దేని నుండో, ఎందుకో- అనేది బుకాయింపు, దబాయింపు లేని తార్కిక బుద్ధికి అది తెలిసి ఉండాలి.

                స్వేచ్చకు సరైన అర్థం ఏమిటంటే వ్యక్తి ధర్మబద్ధంగా జీవించగలిగినప్పుడే నిజమైన స్వేచ్చ, స్వాతంత్ర్యం లభిస్తుంది. మిగిలినదంతా భ్రమాత్మక ఆత్మ వంచన, ప్రకృతి వంచన తప్ప మరొకటి కాదు.

                        ఒక వ్యక్తి తన ఆలోచనలు, పనులు, సంవేదనలు, అన్నీ కూడా ఆ వ్యక్తిలోనే మొదలై, ఆ వ్యక్తిలోనే అంతమవుతున్నాయి. అంటే ఆ వ్యక్తి "స్వేచ్చాజీవి" కింద లెక్క. ఆ వ్యక్తి తన చర్యల గురించి, కార్యాకరణ సంబంధాల గురించి "నాకు తెలియదు" లాంటి పదాలతో పారిపోకుండా చెప్పగలడు అని అర్థం. కానీ అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో అలా చెప్ప గలిగిన వారు ఇంతవరకూ భూమ్మీద పుట్టలేదు. "నీకు చెప్పవలసిన అవసరంలేదు. నీకెందుకు చెప్పాలి. నా ఇష్టం, నాకు అనిపించలేదు , అంతే !" ఇలా డిప్పలో దాగే తాబేలు వ్యక్తిత్వాలే తప్ప, తాను చేసిన పనికి కార్యాకారణ సంబంధం చెప్పగలిగే, లేదా తెలపగలిగిన వ్యక్తులు లేరు.

                          ఇంత వివరం ఎందుకంటే! వ్యక్తి స్వేచ్చ అనే నేటి తప్పుడు భావాన్ని ఖచ్చితంగా మనం గ్రహించాలనే! నేటి సమాజంలో ఒక కుటుంబాన్ని, అందులోని సభ్యులను, వారి ఇష్టా ఇష్టాలను కొద్దిగా గమనిస్తే చాలు. నలుగురు ఉన్న కుటుంబంలో ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అ నలుగురు వ్యక్తులు, నాలుగు రకాల "వ్యక్తిత్వాలతో" నాలుగు కుటుంబాలకు ప్రతినిధులై ఉంటారు.  ఒకే ఇంటిలో భార్య, భర్త, పిల్లలుగా కంటికి కనిపించే  బంధంలో ఉన్నప్పటికీ, వారి మూలాలు వేరు వేరు కుటుంబాలలో ఉంటాయి.